Tilak Varma special gives India 9th Asia Cup crown | ఆసియా కప్-2025 లో భాగంగా ముచ్చటగా మూడవ సారి దాయాధి దేశాన్ని ఓడించి టీం ఇండియా తొమ్మిదవ సారి టైటిల్ ను గెలిచింది. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలోనే తొలిసారి భారత్-పాకిస్థాన్ ఫైనల్స్ లో తలపడ్డాయి.
నరాలు తెగే ఉత్కంఠగా సాగిన ఈ పోరులో టీం ఇండియా ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్ ను మట్టికరిపించింది. భారత్ విజయం సాధించడంలో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించారు. ఆయనకు తోడుగా శివమ్ దూబే కూడా రాణించారు. తొలుత బ్యాటింగ్ కు దిగిన పాక్ జట్టు 146 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది. అనంతరం లక్ష్య చేదనకు దిగిన భారత్ కు ఆదిలోనే షాక్ ఎదురైంది.
సిరీస్ మొత్తం చెలరేగి ఆడిన అభిషేక్ శర్మ ఐదు పరుగులకే ఔట్ అవ్వడం, ఆ వెంటనే కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, శుభమన్ గిల్ వికెట్లు కోల్పోవడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ మొదట్లో ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. వర్మకు తోడుగా శాంసన్ 24 పరుగులు, శివమ్ దూబే 33 పరుగులతో కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.
ఒకానొక దశలో పాక్ గెలుస్తుందని అభిమానులు ఆందోళన చెందుతున్న సమయంలో వర్మ వారియర్ గా నిలబడి, పాక్ బౌలర్లతో తలపడి, భారత్ ను విజయ తీరాలకు చేర్చారు. ఈ క్రమంలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచారు. ఇకపోతే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ నిలిచారు.









