CM Revanth Reddy News | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ములుగు జిల్లా మేడారంలో పర్యటించారు. ఈ సందర్భంగా సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఈ క్రమంలో వనదేవతలకు 68కిలోల నిలువెత్తు బంగారం సమర్పించారు.
అనంతరం మేడారం ప్రాంత అభివృద్ధికి సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రాంగణ ప్రాంతాన్నంతా తిరిగి పరిశీలించారు. ఇలవేల్పులు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలున్న ప్రాంగణానికి సంబంధించి చేపట్టే అభివృద్ధి పనులపై ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
ఆలయ ఆవరణలో చెట్లను సంరక్షించుకుంటూనే విస్తరణ కార్యక్రమాలు జరగాలని అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయలకు ఎక్కడా భంగం వాటిల్లకుండా పూజారులు, ఆదివాసీ పెద్దలతో సంప్రదిస్తూ పనులు కొనసాగించాలని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.









