Rs 1.95 lakh bonus for Singareni regular employees in Telangana | దసరా పండుగ సందర్భంగా సింగరేణి కార్మికులకు శుభవార్త అందించింది తెలంగాణ ప్రభుత్వం. గడిచిన ఏడాది కాలంలో సింగరేణి సంస్థ ఉత్పత్తి, గడించిన లాభాలు, సాధించిన విజయాల ఆధారంగా కార్మికులకు 34 శాతం మేరకు బోనస్ ప్రకటించింది.
ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. సింగరేణి కార్మికులకు బోనస్ అందించాలన్న అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ఇతర మంత్రులు, సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సింగరేణి లాభాల్లో 34 శాతం మేరకు రూ.819 కోట్ల మేరకు బోనస్‌ను సీఎం ప్రకటించారు.
తాజాగా ప్రకటించిన బోనస్ వల్ల ప్రతి కార్మికుడికి రూ.1,95,610 చొప్పున ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు. గతేడాది తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకూ రూ. 5 వేల చొప్పున బోనస్ అందజేయగా, ఈసారి రూ. 5,500 చొప్పున బోనస్ చెల్లించాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పన్నులు పోగా సింగరేణి రూ.6,394 కోట్ల మేరకు లాభాలను గడించగా, అందులో సింగరేణి సంస్థ విస్తరణకు రూ.4,034 కోట్లు కేటాయించారు. మిగిలిన రూ.2360 కోట్లను వివిధ రూపాల్లో కార్మికుల సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించడంతో పాటు, అందులో 34 శాతం మేరకు బోనస్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
మొత్తంగా దాదాపు 71 వేల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. దసరా పండుగను పురస్కరించుకుని ఈ బోనస్ ప్రకటించగా దీపావళి పండుగ సందర్భంలో బోనస్‌కు సంబంధించి మరో ప్రకటన చేస్తామని తెలియజేశారు. సింగరేణి అభివృద్ధిలో సహకరించిన కార్మిక సంఘాలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.








