Khairatabad Ganesh Shobha Yatra 2025 | హైదరాబాద్ నగరంలో గణనాథుల విగ్రహాల నిమజ్జనం కోసం సర్వం సిద్ధమయ్యింది. 11 రోజుల పాటు భక్తులచే ప్రత్యేక పూజలు స్వీకరించిన గణనాథులు శోభాయాత్రల నడుమ నిమర్జనం కోసం బయలుదేరాయి.
మరోవైపు ఖైరతాబాద్ బడా గణేశుడు శోభాయాత్ర శనివారం ఉదయం ప్రారంభమయ్యింది. ఇందులో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. మధ్యాహ్నం బడా గణేశుడి నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది. ట్యాంక్ బండ్ వద్ద ఎన్టీఆర్ మార్గ్ లో నాలుగవ నంబర్ స్టాండులో నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశారు.
ఇందుకోసం బాహుబలి క్రేన్ ను సిద్ధం చేశారు. ఖైరతాబాద్ శోభాయాత్ర కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే బడా గణేశుడి విగ్రహం ముందు పోలీసుల అశ్వదళ బృందం వెళ్తుంది. ఇదిలా ఉండగా ట్యాంక్ బండ్ లో సుమారు 50 వేల విగ్రహాలు నిమజ్జనాలు అయ్యే అవకాశం ఉంది.
10 లక్షలకు పైగా భక్తులు ఇందులో పాల్గొనే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో హుస్సేన్ సాగర్ ప్రాంతంలో 30 వేలకు పైగా పోలీసులు బందోబస్తు విధుల్లో ఉన్నారు.









