Ys Sharmila News | ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు సూపర్ ప్లాప్ అయ్యాయని ఎద్దేవా చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.
ఆగస్ట్ 15న మహిళలకు ఉచిత బస్సు అంటున్నారని, ఉచిత బస్సు పథకం జిల్లాల వరకే పరిమితం చేస్తారా అని ప్రభుత్వాన్ని షర్మిల నిలదీశారు. చిన్న పథకానికి ఇన్ని కొర్రీలు ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మాదిరిగా రాష్ట్రం మొత్తం ఉచితంగా ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇక మహాశక్తి పథకాన్ని అమలు చేయాలి అంటే రాష్ట్రాన్ని అమ్మాలని మంత్రులు అంటున్నారని మండిపడ్డారు. హామీలు ఇచ్చే ముందు ఈ పథకం భారం అని తెలియదా ? రెండు కోట్ల మంది మహిళలను నిలువునా మోసం చేశారని షర్మిల ఫైర్ అయ్యారు. చంద్రబాబు తీరు ఏరు దాటే దాకా ఓడ మల్లన్న … ఏరు దాటాక బోడి మల్లన్న లాగా ఉందన్నారు.
‘నిరుద్యోగ భృతి అని నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారు. 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అనేది తెలియదు. తల్లికి వందనం కింద 20 లక్షల మంది బిడ్డలకు పథకాన్ని ఎగ్గొట్టారు. అన్నదాత సుఖీభవ ఎప్పడు ఇస్తారో తెలియదు’ అని షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. ఇలా ప్రతి హామీ సరిగ్గా అమలు చేయకుండా ప్రజలను దారుణంగా చంద్రబాబు మోసం చేస్తున్నారని మండిపడ్డారు.









