YS Sharmila News | విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ‘రైతన్నకు తోడుగా కాంగ్రెస్’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రాన్ని సమర్పించేందుకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఇతర నాయకులతో కలిసి బయలుదేరారు.
మెడలో ఉల్లిపాయ దండ ధరించి ట్రాక్టర్ మీద ముఖ్యమంత్రి నివాసానికి బయలుదేరిన షర్మిలను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులకు మరియు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. రైతులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా షర్మిల డిమాండ్ చేశారు.
సీఎం చంద్రబాబును కలిసేందుకు అనుమతి ఇచ్చేంత వరకు ఆందోళన కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. రైతుల గురించి ఏపీలో ఎవరూ మాట్లాడడం లేదని షర్మిల నిలదీశారు. మిర్చి, పొగాకు, జొన్న, పత్తి పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని, ఉల్లికి రూ.1200 ఇస్తామని ప్రభుత్వం చెప్పినా మార్కెట్ లో మాత్రం రూ.400 ధర కూడా రావడం లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.









