Why Modi chose Fortuner for drive with Putin | భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ జపాన్ దేశానికి చెందిన తాయోట ఫార్చూనర్ కారులో ప్రయాణించడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ 5న భారత్-రష్యా మధ్య 23వ వార్షిక సదస్సు జరగనుంది. ఈ క్రమంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం పుతిన్ గురువారం రాత్రి భారత్ చేరుకున్నారు.
ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రోటోకాల్ ను బ్రేక్ చేసి మరీ పుతిన్ కు స్వయంగా స్వాగతం పలికారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు దేశాధినేతలు ప్రధాని నివాసం అయిన 7 లోక్ కళ్యాణ్ మార్గ్ కు బయలుదేరారు. ఈ ఇద్దరు నేతలు కలిసి ఒకే కారులో ప్రయాణించారు. కానీ తమ ఆర్మర్డ్ వాహనాలను కాదని సాధారణ ఫార్చూనర్ కారులో వీరు ప్రయాణించడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. సాధారణంగా మోదీ తన అధికారిక రేంజ్ రోవర్ లేదా ఇతర ఆర్మర్డ్ వాహనాలు ఉపయోగిస్తారు. అలాగే పుతిన్ తన ప్రత్యేక ఆరస్ సెనెట్ లిమోజిన్ లో ప్రయాణిస్తారు. అయితే ఈ సారి మాత్రం తమ అధికారిక వాహనాలు కాదని ఫార్చూనర్ కారులో ప్రయాణించడం విశేషం.
దీని వెనుక బలమైన కారణం ఉండే ఉంటుంది అని విశ్లేషణలు వస్తున్నాయి. ఇద్దరు దేశాధినేతలు ప్రయాణించిన ఫార్చూనర్ కారు మోడల్ సిగ్మా 4 MT. మహారాష్ట్రలో ఇది రిజిస్ట్రేషన్ అయ్యింది. ఉక్రెయిన్ యుద్ధం, పాశ్చాత్య దేశాల ఆంక్షల నేపథ్యంలో జపాన్ కు చెందిన ఫార్చూనర్ కారులో వీరు ప్రయాణించారు. ఇకపోతే గతంలో చైనా పర్యటన సమయంలోనూ ప్రధాని-పుతిన్ ఒకే కారులో ప్రయాణించిన విషయం తెల్సిందే.








