West Bengal CM Mamata Banerjee Says Sorry For Messi Fans | అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సి మరియు ఆయన అభిమానులకు క్షమాపణలు కోరారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ‘ది గోట్ టూర్ ఆఫ్ ఇండియా’ లో భాగంగా మెస్సి శనివారం కోల్కత్త చేరుకున్న విషయం తెల్సిందే. అనంతరం ఉదయం మెస్సి సాల్ట్ లేక్ స్టేడియంకు చేరుకున్నారు. కానీ భద్రతా లోపం కారణంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిర్వహణ లోపం మూలంగా కేవలం 10 నినిషాల పాటు కూడా మెస్సి స్టేడియంలో ఉండలేదు. దింతో అభిమానులు ఆగ్రహంతో రెచ్చిపోయారు.
స్టేడియంలో కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసురుతూ రచ్చ చేశారు. ఈ క్రమంలో నిర్వహణ లోపం జరిగిందని వెల్లడించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మెస్సికి, అభిమానులకు క్షమాపణలు చెప్పారు. వేలాది మంది అభిమానులతో కలిసి మెస్సిని చూసేందుకు తాను కూడా స్టేడియానికి బయలుదేరినట్లు కానీ అక్కడి ఉద్రిక్త పరిస్థితులు సమాచారం తెలియడంతో వెనుదిరిగినట్లు చెప్పారు. నిర్వహణ లోపం జరిగిందని తెలిసి దిగ్భ్రాంతికి గురయినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్టేడియం ఘటనపై జస్టిస్ ఆషిమ్ కుమార్ అధ్యక్షతన విచారణ కమిటీ వేసినట్లు దీదీ వెల్లడించారు. దర్యాప్తు అనంతరం నిర్వహణ వైఫల్యానికి కారణం అయిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సీఎం స్పష్టం చేశారు.









