Virat Kohli Slams 53rd ODI Century | రాయపూర్ స్టేడియంలో మరోసారి విజృంభించారు రన్ మెషీన్ విరాట్ కోహ్లీ. అలాగే రుతురాజ్ గైక్వాడ్ వన్డే ఫార్మాట్ లో తొలి సెంచరీని నమోదు చేసుకోవడం విశేషం. బుధవారం రాయ్ పూర్ వేదికగా ఇండియా-సౌత్ ఆఫ్రికా మధ్య రెండవ వన్డే జరిగిన విషయం తెల్సిందే. టాస్ ఓడి టీం ఇండియా బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు జైస్వాల్, రోహిత్ శర్మ త్వరగానే పెవిలియన్ బాట పట్టారు. కానీ విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ మాత్రం సెంచరీల మోత మోగించి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.
83 బంతుల్లో 105 పరుగులతో వన్డేలో తొలి సెంచరీని నమోదు చేసిన గైక్వాడ్ ఔట్ అయ్యారు. ఆ తర్వాత పరుగుల వీరుడు విరాట్ కూడా వన్డేల్లో 53వ సెంచరీ నమోదు చేసుకున్నారు. మొత్తంగా ఇది కోహ్లీకి 84వ అంతర్జాతీయ సెంచరీ. ఇకపోతే సౌత్ ఆఫ్రికాతో వరుసగా జరిగిన రెండు మ్యాచుల్లో కోహ్లీ సెంచరీ నమోదు చేశారు. రాంచీ వేదికగా జరిగిన మ్యాచులో 135 పరుగులు చేసిన విషయం తెల్సిందే. ఇలా వరుసగా రెండు మ్యాచుల్లోనూ కోహ్లీ సెంచరీలు నమోదు చేయడం ఇది 11వ సారి.
అలాగే నాలుగు దేశాలపై ఏడు అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన తొలి బ్యాటర్ గా నిలిచారు కోహ్లీ. శ్రీలంకపై 10, వెస్ట్ ఇండీస్ పై 9, ఆస్ట్రేలియాపై 8, సౌత్ ఆఫ్రికాపై ఏడు సెంచరీలు నమోదు చేశారు. ఈ క్రమంలో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 100 సెంచరీలు రికార్డు ఇంకా సజీవంగానే ఉందని కామెంట్లు చేస్తున్నారు.









