violence against Hindus in Bangladesh | బంగ్లాదేశ్ లో మైనారీటీలు అయిన హిందువులు అనుక్షణం భయం భయంగా గడుపుతున్నారు. వరుసగా హిందువులు హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపుతోంది. గత 18 రోజుల్లోనే ఆరుగురు హిందువులు హత్యకు గురయ్యారు. దీపు చంద్రదాస్ ను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దీనిపై ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న చర్యలు పెద్దగా ఏమీ లేవు. దింతో అల్లరి ముష్కరులు మరింత రెచ్చిపోతున్నారు.
కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు హిందువులను హత్య చేశారు. జెషోర్ జిల్లాకు చెందిన రాణాప్రతాప్ బైరాగీ జర్నలిస్టు. అలాగే ఆయన ఓ ఐస్ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారు. అయితే సోమవారం సాయంత్రం ముగ్గురు దుండగులు రాణాప్రతాప్ ను తుపాకీతో కాల్చి హత్య చేశారు. ఇకపోతే నర్సింగ్డి జిల్లాకు చెందిన మణి చక్రవర్తి స్థానికంగా అత్యంత రద్దీగా ఉండే చార్ సింధూర్ బజార్ లో కిరాణా దుకాణం నడుపుతున్నారు. సోమవారం రాత్రి కొందరు దుండగులు ఆయన దుకాణంలోకి ప్రవేశించి ఆయుధాలతో దాడి చేసి హత్య చేశారు. ఇలా కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇద్దరి హత్యలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ మైనారీటీలు భయాందోళనకు గురవుతున్నారు. విద్యార్ధి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్య ఆనంతరం బంగ్లాలో హింసాత్మక నిరసనలు చెలరేగాయి. ఇదే సమయంలో హిందువులపై దాడులు కూడా అధికం అయ్యాయి.









