Techie couple attend own wedding reception online after Indigo flights get cancelled | ఇండిగో ఎయిర్లైన్స్ కొన్నిరోజులుగా అపరేషనల్ సమస్యలతో సతమతం అవుతుంది. ఈ క్రమంలో నవ దంపతులు తమ సొంత పెళ్లి రిసెప్షన్ కు ఆన్లైన్ లో హాజరు కావాల్సి వచ్చింది. ఆన్లైన్ లో పెళ్లి దుస్తులు ధరించి రిసెప్షన్ కు వచ్చిన బంధువుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఇండిగో విమాన సర్వీసుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. గత కొన్ని రోజులుగా వందలాది విమానాలు రద్దు అవుతున్నాయి.
దింతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు. ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరు కాలేకపోతున్నారు. ఇలా బెంగళూరు టెకీలు సొంత వివాహ రిసెప్షన్ కు హాజరు కాలేకపోయారు. ఒడిశా భువనేశ్వర్ కు చెందిన సంగమ దాస్ మరియు కర్ణాటక హుబ్లీకి చెందిన మేధా బెంగళూరులో టెకీలుగా పనిచేస్తున్నారు. నవంబర్ 23న వీరి వివాహం భువనేశ్వర్ లో జరిగింది. అలాగే డిసెంబర్ 3న హుబ్లీ లో రిసెప్షన్ వేడుక జరగనుంది. హుబ్లీలోని గుజరాత్ హౌస్ లో బుధవారం సాయంత్రం రిసెప్షన్ వేడుక ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. బంధువులు వచ్చారు.
మరోవైపు మాత్రం భువనేశ్వర్ నుంచి బెంగళూరు మీదుగా హుబ్లీకి ఇండిగో విమానంలో నవ దంపతులు వెళ్లాల్సి ఉంది. ఈ మేరకు టికెట్లు సైతం బుక్ అయ్యాయి. కానీ అనూహ్యంగా విమానం రద్దు అయ్యింది. గంటల పాటు వేచి చూసినా ఫలితం లేకుండా పోయింది. ఇండిగో సంస్థ నిర్లక్ష్యంతో ఈ దంపతులు తమ రిసెప్షన్ కు హాజరు కాలేకపోయారు. అనంతరం కుటుంబ సభ్యులతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చారు ఈ నవ దంపతులు. బంధువులు అప్పటికే వచ్చేశారు కనుక రిసెప్షన్ ను రద్దు చెయ్యలేరు. చేసేదేమీ లేక నూతన దుస్తువులు ధరించి ఆన్లైన్ లో వీడియో కాల్ ద్వారా సొంత రిసెప్షన్ కు హాజరయ్యారు ఈ నవ దంపతులు.









