Shivakumar dares BJP to change Gandhi photo on notes | కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి సవాల్ విసిరారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. కరెన్సీ నోట్లపై ఉన్న గాంధీ ఫోటోను మార్చే దమ్ము మోదీ సర్కారుకు ఉందా అని ప్రశ్నించారు. కాగా జాతీయ ఉపాధి హామీ పథకం అయిన ‘మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయమెంట్ గ్యారంటీ యాక్ట్’ ను రద్దు చేసి దీని స్థానంలో కొత్త చట్టం తీసుకురావాలని కేంద్రం నిర్ణయించుకుంది. ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజగార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్’ (వీబీ జీ రామ్ జీ) అనే చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే పథకానికి మహాత్మాగాంధీ పేరును తొలగించడం పట్ల విపక్ష ఇండీ కూటమి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. పేరును మార్చుతూనే పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం కేంద్రం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా నిరసనలకు హస్తం పార్టీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా కర్ణాటక బెళగావిలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఓ వైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే కేంద్రం మాత్రం పథకాల పేర్ల మార్పులో బిజీగా ఉందన్నారు సీఎం. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాల పేర్లను మార్చి తమ పథకాలుగా ప్రచారం చేసుకోవాలని మోదీ చూస్తున్నారని మండిపడ్డారు.
అనంతరం డీకే శివకుమార్ మాట్లాడుతూ..రాజ్యాంగ సవరణ ద్వారా ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చినట్లు, రాజ్యాంగ సవరణను మార్చే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో మరో పథకాన్ని తీసుకురావడం అనేది జాతీయ సమస్య అని పేర్కొన్నారు. ఇదే సమయంలో కరెన్సీ నోట్లపై ఉన్న గాంధీ ఫోటోను మార్చే దమ్ము బీజేపీ సర్కారుకు ఉందా అని సవాల్ విసిరారు డీకే.









