Sajjanar warns transgender groups against extortion in Hyderabad | ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ.. బలవంతపు వసూళ్లకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ట్రాన్స్‌జెండర్లను హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలను వీడి, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని వారికి ఆయన హితవు పలికారు.
హైదరాబాద్ అమీర్ పేటలోని సెంటర్ పర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్) ఆడిటోరియంలో 250 మంది ట్రాన్స్ జెండర్లతో హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. సీఐడీ, మహిళా భద్రతా విభాగ అదనపు డీజీపీ చారు సిన్హా పాల్గొన్నారు. వారు నేరుగా ట్రాన్స్ జెండర్లతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ట్రాన్స్‌జెండర్ల మధ్య గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరు తరచూ శాంతిభద్రతల సమస్యలకు, ప్రాణ నష్టానికి కారణమవుతున్నాయని సజ్జనర్ ఆందోళన వ్యక్తం చేశారు. “ఈ మధ్య ట్రాన్స్ జెండర్లపై ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. శుభకార్యాల పేరుతో ఇళ్లపై పడి యజమానులను వేధించడం సరికాదు. ఇలాంటి బలవంతపు వసూళ్లను సహించం. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎంతటి వారినైనా కటకటాల వెనక్కి పంపిస్తాం. మీపై నమోదయ్యే కేసులు మీ భవిష్యత్తును నాశనం చేస్తాయి. అమాయక ప్రజలను ఇబ్బంది పెడితే జైలు శిక్షలు తప్పవు” అని ఆయన హెచ్చరించారు.









