Sajjanar warns against cyber fraud using RBI’s UDGAM portal | ఆర్బీఐ ‘ఉద్గమ్’ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారని సదరు లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ గుల్ల అవుతుందని హెచ్చరించారు హైదరాబాద్ సీపీ సజ్జనర్. ఈ మేరకు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. సైబర్ నేరగాళ్లు కొత్త పంథాను ఎంచుకున్నారని ఈసారి ఆర్బీఐని కూడా వదలట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
బ్యాంకుల్లో మురిగిపోయిన పైసలు, అన్ క్లేమ్డ్ డిపాజిట్స్ ఇప్పిస్తామంటూ జనం నెత్తిన టోపీ పెడుతున్నరని పేర్కొన్నారు. ఆర్బీఐ తీసుకొచ్చిన ‘ఉద్గమ్’ పోర్టల్ పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు నయా దందాకు తెర లేపారని వివరించారు. “మీ పాత ఖాతాల్లో లక్షలున్నయ్..ఈ లింక్ క్లిక్ చేసి తీసుకోండి” అని మెసేజ్ లు, మెయిల్స్ పంపిస్తున్నరని, ఆశపడి ఆ లింక్ క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అవుతుందని ఆ తర్వాత క్షణాల్లో బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుందన్నారు.
ఆర్బీఐ ఎప్పుడూ ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు అడగదని అధికారులం అని ఫోన్ చేస్తే నమ్మవద్దని సూచించారు. అన్‌క్లెయిమ్‌డ్ డిపాజిట్ల కోసం udgam.rbi.org.in అనే వెబ్‌సైట్ మాత్రమే చూడాలన్నారు. వాట్సాప్, మెయిల్స్ లో వచ్చే పిచ్చి లింకులను అస్సలు క్లిక్ చేయొద్దని ప్రజలను అప్రమత్తం చేశారు. ఒకవేళ పొరపాటున మోసపోతే వెంటనే 1930 నంబర్ కు కాల్ చేయాలని కోరారు.









