RTI reveals AP former CM Jagan spent ₹222.85 crore on air travel | వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విమాన ప్రయాణ ఖర్చుల కోసం ఏకంగా రూ.222 కోట్లు ఖర్చు చేశారని రాష్ట్ర ఏవియేషన్ కార్పోరేషన్ నివేదికలో వెల్లడించడం సంచలనంగా మారింది. ఇది టీడీపీ, వైసీపీ మధ్య తీవ్ర యుద్ధానికి కారణం అయ్యింది. మంత్రి నారా లోకేశ్ వ్యక్తిగత హైదరాబాద్ పర్యటనల కోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని జగన్ పార్టీ విమర్శలు గుప్పించింది.
ఈ నేపథ్యంలో కొడమాల సురేష్ బాబు అనే వ్యక్తి ఆర్టీఐ ఫైల్ చేశారు. ఇందులో మంత్రి లోకేశ్ తన పర్యటనల కోసం ప్రభుత్వ నిధులను కాకుండా సొంత డబ్బులను చెల్లించారని సంబంధిత శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పోరేషన్ లిమిటెడ్ వెల్లడించిన నివేదిక ప్రకారం 2019 నుంచి 2024 వరకు నాటి వైసీపీ ప్రభుత్వం రూ.222 కోట్లను విమాన ప్రయాణ ఖర్చుల కోసం వెచ్చించిందని తెలిపింది. విమాన ఖర్చులు రూ.122 కోట్లు, హెలికాప్టర్ల కోసం రూ.87 కోట్లు, ఇతర ఆపరేషనల్ ఖర్చుల కోసం రూ.23 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించడం సంచలనంగా మారింది.
ఈ క్రమంలో మంత్రి నారా లోకేశ్ స్పందించారు. రాష్ట్ర ప్రజలు ఉద్యోగాల కోసం, కనీస వసతుల కోసం ఎదురుచూస్తున్న సమయంలో నాటి ముఖ్యమంత్రి జగన్ రూ.500 కోట్లతో ఒక ప్యాలెస్, రూ.222 కోట్లతో గాలిలో తిరగడానికి ఖర్చు చేశారని ధ్వజమెత్తారు. చివరికి నిజం వెలుగులోకి వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఒక విజన్ అవసరం కానీ దొరికింది మాత్రం ఒక వేకేషన్ మాత్రమే అని ఎద్దేవాచేశారు.









