Prashant Kishor Is On Maun Vrat | బీహార్ శాసనసభ ఎన్నికల్లో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన జన్ సురాజ్ పార్టీ ఊహించిన మేర ప్రభావం చూపలేకపోయింది. ఆ పార్టీ ఒక్క సీటును కూడా గెలవలేదు. ఈ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు.
అలాగే ఓటమికి గల కారణాలను సమీక్షించుకునేందుకు ఒక రోజు పాటు మౌనవ్రతం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో గురువారం భితిహర్వా గాంధీ ఆశ్రమంలో పార్టీ నేతలతో కలిసి మౌనవ్రతంలో కూర్చున్నారు. పట్నాలోని గాంధీ మైదాన్ లో బీహార్ ముఖ్యమంత్రిగా పదవసారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే ప్రశాంత్ కిషోర్ మౌనవ్రతం చేపట్టడం ఆసక్తిగా మారింది.
శుక్రవారం ఉదయం వరకు మౌనవ్రతం కొనసాగనుంది. ఈ సమయంలో బీహార్ ఎన్నికల్లో జన సురాజ్ పార్టీ ఓటమికి గల కారణాలను మౌనంగానే సమీక్షించుకుంటారు ఆయన. ఓటమిని సమీక్షించుకుని, తిరిగి మరింత ఉత్తేజంతో పని చేస్తామని ప్రశాంత్ కిషోర్ ఇటీవల పేర్కొన్న విషయం తెల్సిందే.









