Police warns of strict action against those using Chinese Manja | పక్షులతో పాటు, ప్రజలకు ప్రమాదకరంగా మారిన చైనా మాంజాను ఎవరైనా విక్రయించినా, వినియోగించినా, వారి పట్ల కఠినంగా వ్యవహారిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. సంక్రాతి పండుగ సమిపిస్తున్న వేళ యువత గాలి పటాలను ఎగురవేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో అధికంగా చైనా మాంజా ఉపయోగించి గాలి పటాలను ఎగుర వేయడం ఆసక్తి కనబరుస్తారని తెలిపారు. కాని యువత వినియోగించే చైనా మాంజాను సింథటిక్ దారం, గాజు పొడితో తయారు చేస్తారని ఇది చాలా ప్రమాదకమని ఈ దారాన్ని ఉపయోగించడం ద్వారా పక్షుల గొంతు, రెక్కలు తెగిపోవడం, మనుషులకు గాయాలు కావడం జరుగుతుందని వివరించారు.
ఎవరైనా చైనా మాంజా విక్రయించినా, వినియోగించినా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఇది చట్టవిరుద్ధమన్నారు. ఈ చైనా మాంజా నియంత్రణకై ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు, ఇందులో భాగంగానే టాస్క్ ఫోర్స్ పోలీసులు హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమార్ పల్లి ప్రాంతం ఆనంద్ అనే వ్యక్తి ఇంటి పై దాడి చేసి సూమారు రూ.2 లక్షల విలువ చేసే చైనా మాంజాను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఎవరైనా చైనా మాంజా విక్రయాలకు పాల్పడితే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు.








