PM Modi and President Trump take first steps to patch up | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పట్ల తన వైఖరిని మార్చుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో తనకు మంచి స్నేహం ఉందని, ఆయన గొప్ప ప్రధాని అనే కితాబిచ్చారు.
రష్యా నుంచి భారత్ అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ 50 శాతం సుంకాలు విధించిన విషయం తెల్సిందే. అలాగే చైనాలో జరిగిన షాంఘై సహకార శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ద్వైపాక్షికంగా భేటీ అయ్యారు. ఈ భేటీపై స్పందించిన ట్రంప్ భారత్, రష్యాలను చైనాకు కోల్పోతున్నట్లు కనిపిస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు.
కానీ తాజాగా మాత్రం ఆయన మాట మార్చారు. శుక్రవారం వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన ట్రంప్ ప్రధాని మోదీని ప్రశంసించారు. ప్రధాని మోదీతో తనకు మంచి స్నేహం ఉందన్నారు ట్రంప్. అలాగే మోదీ గొప్ప ప్రధాని అని కితాబిచ్చారు. భారత్-అమెరికా మధ్య ప్రత్యేక బంధం ఉందని ఇందులో ఆందోళన ఏమీ లేదన్నారు. కానీ ప్రస్తుతం మాత్రమే సమస్య తలెత్తిందన్నారు.
అంతేకాకుండా ప్రస్తుతం మోదీ చేస్తున్న పని తనకు నచ్చడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. కాగా ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించారు. భారత్-అమెరికా సంబంధాలపై ట్రంప్ ఆలోచనలు, సానుకూల దృక్పథాన్ని అభినందిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ఇరుదేశాలు మంచి భవిష్యత్, వ్యూహాత్మక భాగస్వామ్యం కలిగి ఉన్నాయని నొక్కిచెప్పారు.









