Pashamylaram Reactor Blast | సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని పారిశ్రామికవాడలో సోమవారం ఉదయం భారీ పేలుడు సంభవించిన విషయం తెల్సిందే.
సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 8 మంది మృతిచెందారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, గాయపడిన వారికి అత్యవసర వైద్య సహాయం అందించాలని ఆదేశించారు.
మరోవైపు ఈ దుర్ఘటనపై బీఆరెస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తంచేస్తూ తన సంతాపాన్ని ప్రకటించారు. మృతుల సంఖ్య ఇంకా పెరగనున్నదనే వార్తలు ఆందోళనకు గురి చేశాయన్నారు.
ప్రమాదానికి కారణాలపై విచారణ జరిపించాలని, అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అందించాలని, చనిపోయిన కార్మికులు ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి కేసీఆర్ సూచించారు.