Nepal PM KP Oli resigns after violent anti-corruption protests sparked by social media ban | నేపాల్ దేశంలో రాజకీయ అస్థిరత నెలకొంది. తమను తాము జెన్-జి లుగా పిలుచుకుంటున్న నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం బాట పట్టారు.
ఇటీవలే నేపాల్ ప్రభుత్వం ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్ సహా 26 యాపులపై నిషేధం విధించింది. ఈ క్రమంలో ప్రభుత్వం తమ భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తుందని యువత ఆందోళనకు దిగారు. సోషల్ మీడియా యాపులపై నిషేధమే కాకుండా ప్రభుత్వం తీవ్ర అవినీతికి పాల్పడుతుందని, రాజకీయ అస్థిరత నెలకొందని వారు పేర్కొన్నారు.
నేపాల్‌లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ మంగళవారం రాజీనామా చేశారు. రాజీనామాకు ప్రధాన కారణం సామాజిక మాధ్యమాలపై నిషేధం, అవినీతి ఆరోపణలు, మరియు జెనరేషన్ జెడ్ యువత నిరసనలు హింసాత్మకంగా మారడం అని తెలుస్తోంది.
సోమవారం నిరసనకారులు పార్లమెంట్ గేటును ధ్వంసం చేసి, ప్రధాని నివాసంతో పాటు ఇతర కీలక ప్రభుత్వ భవనాలను ముట్టడించారు. భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో 19 మంది మరణించారు, 300 మందికి పైగా గాయపడ్డారు.
ఈ హింసాత్మక సంఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ హోం మంత్రి రమేష్ లేఖక్ సోమవారం సాయంత్రం రాజీనామా చేశారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి రామ్‌నాథ్ అధికారి, నీటి సరఫరా శాఖ మంత్రి ప్రదీప్ యాదవ్ మరియు ఆరోగ్య శాఖ మంత్రి ప్రదీప్ పౌడేల్ కూడా తమ పదవులను వీడారు.
నిరసనలు ఆగకపోవడం, మంత్రుల వరుస రాజీనామాలు, మరియు సైన్యం సూచనల నేపథ్యంలో కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. ఓలీ దుబాయ్‌కు వైద్య చికిత్స కోసం వెళ్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరికొన్ని మీడియా కథనాలు ఆయన రాజకీయ సంక్షోభం నుంచి తప్పించుకోవడానికి దుబాయ్‌కు పారిపోతున్నారని పేర్కొన్నాయి.









