Nearly 9 Lakh Indians Gave Up Citizenship In Five Years | భారతీయ పౌరసత్వాన్ని వదులుకునే వారి సంఖ్య రోజు రోజులు అధికం అవుతుంది. దీని వెనుక అనేక కారణాలు ఉన్నప్పటికీ ఇది ఆందోళన కలిగించే అంశం అని నిపుణులు పేర్కొంటున్నారు. గత ఐదేళ్లలో సుమారు 9 లక్షల మంది అలాగే 2011 నుంచి 2019 మధ్య ఏకంగా 12 లక్షల మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు. అంటే 2011 నుంచి 2024 వరకు 20 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు.
ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ పార్లమెంటులో వెల్లడించింది. రాజ్యసభ లో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి కిర్తి వర్ధన్ సింగ్ ఈ డేటాను వెల్లడించారు. 2011-2019 మధ్య 11,89,194 మంది పౌరసత్వాన్ని వదులుకున్నట్లు తెలిపారు. అలాగే 2019-2024 మధ్య 8,96,843 మంది పౌరసత్వాన్ని వదులుకున్నారని మంత్రి వివరించారు. అత్యధికంగా 2022లో 2,25,620 మంది భారతీయ పౌరసత్వాన్ని కాదని విదేశీ పౌరసత్వాన్ని పొందారు. మరోవైపు గత ఐదేళ్లలో కేవలం 800 మంది విదేశీయులు మాత్రమే దేశ పౌరసత్వాన్ని పొందారు.









