MLA Rajasingh Resigns To BJP | తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కాషాయ పార్టీకి రాజీనామా చేశారు గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ మేరకు కేంద్రమంత్రి, ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను అందజేశారు.
సోమవారం తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నిక కోసం నామినేషన్లను స్వీకరించారు. ఈ క్రమంలో బీజేపీ కార్యాలయానికి రాజాసింగ్ నామినేషన్ వేయడానికి వెళ్లారు. అయితే తనను నామినేషన్ వేయడానికి అనుమతించలేదని, తన వారిని బెదిరించారని పేర్కొన్నారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకూడదనే విధంగా కొందరు పెద్ద నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధ్యక్ష పదవి ఎంపిక తనను ఆశ్చర్యానికి గురి చేసిందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి అందజేసినట్లు చెప్పారు.
అలాగే బీజేపీ గుర్తుపై గెలిచిన తనను ఎమ్మెల్యే పదవి నుండి కూడా సస్పెండ్ చేసే విధంగా అసెంబ్లీ స్పీకర్ కు లేఖను పంపాలని కోరినట్లు రాజాసింగ్ తెలిపారు. తాను 2014నుండి ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు.
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటే మరోవైపు మాత్రం పార్టీకే చెందిన పెద్ద నాయకులు రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవద్దని కోరుకుంటున్నారని బాంబ్ పేల్చారు. ఈ సందర్భంగా నీకో దండం నీ పార్టీకో దండం అంటూ రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి ఇచ్చినట్లు రాజాసింగ్ స్పష్టం చేశారు.









