Konda Surekha Participates In Karthika Pournami Pooja | పవిత్రమైన కార్తీక పౌర్ణమి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ( Konda Surekha ) శుక్రవారం ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది గ్రామంలోని రామలింగేశ్వరస్వామి దేవాలయంలో మహాశివుని సేవలో తరించారు. దేవాలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మంత్రి సురేఖ అర్చకుల వేదమంత్రాల నడుమ రామలింగేశ్వర స్వామికి పంచామృతాభిషేకం, భస్మాభిషేకం నిర్వహించారు. మహాశివునికి స్వహస్తాలతో హారతినిచ్చారు. దేవాలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు మంత్రి సురేఖని శాలువాతో సత్కరించారు.
రామలింగేశ్వర స్వామి దేవస్థాన ఆలయ విశిష్టతను నిర్వాహకులు మంత్రి సురేఖకి వివరించారు. దేవాలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ తరఫున తనవంతు సహకారం అందిస్తామని మంత్రి సురేఖ నిర్వాహకులకు హామీ ఇచ్చారు.