Kalvakuntla Kavita News | ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గురువారం పరిశీలించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. ఉప్పల్ ఫ్లై ఓవర్ ను 8 ఏళ్లుగా కడుతూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఉప్పల్ ప్రజల పరిస్థితి మారటం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశంపై తాను శాసన మండలిలో ప్రశ్నిస్తే మంత్రి కోమటి రెడ్డి స్పందించి త్వరలోనే సమీక్ష చేసి పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత కాంట్రాక్టర్ ను మార్చారో లేదో తెలియదు కానీ ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు ఉందని మండిపడ్డారు.
ఘట్కేసర్ వరకు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నారని కానీ గత 8 ఏళ్లుగా కడుతున్నారంటే ప్రజల పట్ల ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ది ఉందో తెలుస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కో ఆర్డినేషన్ లేకపోవటం కారణంగానే ఆలస్యమవుతోందని పేర్కొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనులు పూర్తి చేయించాలని చెప్పారు. అలాగే స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ ఇక్కడకు వచ్చి పరిస్థితిని చూడాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.









