JanaSena Leader Kotte Sai as the Chairman of Srikalahasti Temple | జనసేన పార్టీ కార్యకర్తకు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఛైర్మన్ పదవి దక్కింది. శ్రీకాళహస్తికి చెందిన కొట్టే సాయి ప్రసాద్ ను జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఛైర్మన్ కి ప్రతిపాదించారు.
ఇందుకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం సాయి ప్రసాద్ పేరును ప్రకటించింది. అయితే 2023లో శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ నేపథ్యంలో పోలీసులు చర్యలు చేపట్టారు. ఆ సందర్భంలో కొట్టే సాయిని అప్పటి సీఐ అంజు యాదవ్ చెంపదెబ్బ కొట్టారు. ఈ ఘటన అప్పట్లో కలకలం రేపింది.
ఘటన జరిగిన రోజున తాడేపల్లిగూడెం సమావేశంలో ఉన్న పవన్ కళ్యాణ్ తక్షణం స్పందించారు. ఆ తరవాత కొట్టే సాయిని, నాయకులను వెంటబెట్టుకొని తిరుపతి వెళ్ళి జిల్లా ఎస్పీని కలిసి పోలీసుల చర్యపై ఫిర్యాదు చేశారు. తాజగా సాయి ప్రసాద్ కు శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్ గా ఎంపిక చేయడం పట్ల జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.









