India Maintain ‘No-Handshake’ Policy Against Pakistan In U19 Asia Cup | పాకిస్థాన్ ప్లేయర్లతో నో షేక్ హ్యాండ్ విధానాన్ని కొనసాగిస్తోంది టీం ఇండియా. అండర్-19 ఆసియా కప్ లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా దాయాధి పాకిస్థాన్ తో టీం ఇండియా తలపడింది. ఈ క్రమంలో టీం ఇండియా గత కొన్ని నెలలుగా కొనసాగిస్తున్న నో షేక్ హ్యాండ్ విధానాన్ని యువ జట్టు కూడా కొనసాగించింది. టాస్ సమయంలో టీం ఇండియా కెప్టెన్ ఆయుష్ మాత్రే, పాకిస్థాన్ కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.
ఇకపోతే టాస్ గెలిచిన పాక్ బౌలింగ్ ఎంచుకుంది. ఆసియా కప్-2025 లో భాగంగా టీం ఇండియా ముచ్చటగా మూడు సార్లు పాక్ తో తలపడింది. అయితే జమ్మూకశ్మీర్ పహల్గాంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాల్పులు జరిపి అమాయకుల ప్రాణాలు బలికొన్న విషయం తెల్సిందే. అనంతరం భారత్ ఆపరేషన్ సింధూర్ తో పాక్ లో తలదాచుకున్న ఉగ్రవాదులపై విరుచుకుపడింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. దాయాధి దేశంతో ఎలాంటి దౌత్య సంబంధాలు ఉండవని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.
దింతో టీం ఇండియా పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయొద్దని నిర్ణయం తీసుకుంది. అప్పట్లో ఈ నిర్ణయంపై పాక్ అక్కస్సు వెళ్లగక్కింది. కాగా అండర్ 19 ఆసియా కప్ లో కూడా టీం ఇండియా పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించింది. మరోవైపు భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరచాలనం చేసేలా చూడాలని ఐసీసీ బీసీసీఐని కోరినట్లు తెలుస్తోంది. అయితే తుది నిర్ణయాన్ని మాత్రం బీసీసీఐకే వదిలేసినట్లు కథనాలు వస్తున్నాయి.









