Harish Rao slams Congress govt for lapses in Group-1 exams | గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. జనరల్ ర్యాంకింగ్ లిస్టును అలాగే మార్కుల జాబితాను కొట్టివేసిన కోర్టు జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలని స్పష్టం చేసింది. ఎనిమిది నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లేని పక్షంలో తిరిగి పరీక్ష నిర్వహించాలను పేర్కొంది.
ఈ నేపథ్యంలో బీఆరెస్ సీనియర్ నాయకులు హరీష్ రావు స్పందించారు. గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలు, పరీక్ష కేంద్రాల కేటాయింపు, హల్ టికెట్ల జారీ, పరీక్ష ఫలితాల్లో అనుమానాలు, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో నేడు హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టని తెలిపారు.
లోపభూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ కోర్టు తీర్పుకు మీరు చెప్పే సమాధానం ఏమిటి? అని ప్రశ్నించారు. హడావుడిగా పరీక్షలు నిర్వహించి, అవకతవకలకు పాల్పడ్డ నిర్లక్ష్యానికి విద్యార్థులు, నిరుద్యోగులు బలవుతున్నారని ప్రభుత్వం పై ధ్వజమెత్తారు.
పరీక్షలు నిర్వహించడం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అంటే విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టి చిల్లర రాజకీయాలు చేయడం కాదని హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ యువతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని ఈ సందర్భంగా హరీష్ డిమాండ్ చేశారు









