Dharmapuri Arvind News | నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసి ఆ తర్వాత రౌడీ షీటర్ రియాజ్ పారిపోయాడు. ఈ క్రమంలో రౌడీ షీటర్ రియాజ్ ని పట్టుకోవడంలో సహాయం చేసి, అతడి దాడిలో సయ్యద్ ఆసిఫ్ తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆసిఫ్ ను పరామర్శించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ తో కలిసి రాంనగర్ లోని నివాసంలో ఆసిఫ్ ను అర్వింద్ పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.50,000 ఆర్థిక సహాయం చేశారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా ఉద్యోగం త్వరగా వచ్చేలా ప్రభుత్వంతో మాట్లాడుతా అని ఎంపీ పేర్కొన్నారు.
అలాగే గ్యాలంట్రీ అవార్డు కోసం కూడా సిఫారస్ చేయనున్నట్లు ఎంపీ అర్వింద్ ఆసిఫ్ కు తెలిపారు. అనంతరం విధి నిర్వహణలో రౌడీ షీటర్ రియాజ్ చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించారు. రూ.రెండు లక్షల ఆర్థిక సహాయాన్ని అందించి, పెద్ద కుమారుడికి ఉచిత విద్యాభ్యాసాన్ని అందజేయాలని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాన్ని కోరారు. భవిష్యత్తులో వారి కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.









