Dead candidate wins Sarpanch seat in Rajanna Sircilla | రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఓ వ్యక్తి మృతిచెందారు. అయితే ఆయన మరణించిన వారం తర్వాత జరిగిన ఎన్నికలో ప్రజలు మృతి చెందిన వ్యక్తిని గెలిపించారు. ఈ క్రమంలో తర్వాత ఏం జరగనుందో అనే అంశంపై ఆ గ్రామంలో ఉత్కంఠ నెలకొంది.
గురువారం పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికలు జరిగాయి. సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చింతలఠాణా పంచాయతీ సర్పంచ్ గా దివంగత చెర్ల మురళి గెలిచారు. గ్రామంలో మురళి చికెన్ సెంటర్ ను నిర్వహించేవారు. ఆయన గతంలో వార్డు మెంబర్ గా ప్రజలకు సేవలందించారు. ఈ సారి పంచాయతీ ఎస్సి రిజర్వ్ అయ్యింది. దింతో బీఆరెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా మురళి బరిలోకి దిగారు. మద్దతుదారులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలతో మమేకం అయ్యారు. అయితే అనూహ్యంగా డిసెంబర్ 4న ఆయన గుండెపోటుతో కన్నుమూశారు.
దింతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరో ఐదుగురు సర్పంచ్ ఎన్నిక బరిలో ఉండడంతో అధికారులు గురువారం ఎన్నిక నిర్వహించారు. ఈ నేపథ్యంలో భౌతికంగా లేకపోయినా మురళిపై గ్రామస్థులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. 350కి పైగా ఓట్ల మెజారిటీతో దివంగత మురళిని సర్పంచ్ గా గెలిపించుకున్నారు. కానీ భౌతికంగా మురళి లేకపోవడంతో అధికారులు ఎన్నికల ప్రక్రియను నిలిపివేశారు.









