Cyclone Montha Effect On Ys Jagan | మొంథా తుఫాన్ ముంచుకొస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కోస్తా జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో తుఫాన్ ప్రభావం సామాన్య ప్రజలపై తీవ్రంగా ఉంది. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కూ మొంథా తుఫాన్ సెగ తగిలింది. తుఫాన్ కారణంగా జగన్ ఏపీకి ఆలస్యంగా రానున్నారు.
ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్ మంగళవారం గన్నవరం చేరుకోవాల్సి ఉంది. అయితే ఆయన ప్రయాణించాల్సిన విమానం రద్దయ్యింది. దింతో జగన్ ప్రయాణం వాయిదా పడింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. తుపాను ప్రభావంతో గన్నవరం విమానాశ్రయానికి విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.
విమాన సర్వీసులు పునరుద్ధరిస్తే బుధవారం ఆయన వస్తారని ప్రకటనలో వెల్లడించింది. తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగన్ విజ్ఞప్తి చేశారు. ముందుజాగ్రత్త, సహాయ పునరావాస చర్యల్లో ప్రజలకు తోడుగా నిలవాలని పార్టీ శ్రేణులకు, నాయకులకు ఆయన పిలుపునిచ్చారు.









