CPI Narayana On I-Bomma Ravi | సినిమా టికెట్ల రేట్లు పెంచి ప్రజలపై భారం మోపే ప్రభుత్వాలకు ఐ బొమ్మ రవి లాంటి వ్యక్తులను అరెస్ట్ చేసే నైతిక హక్కు లేదన్నారు సీపీఐ నేత నారాయణ. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ-2 డిసెంబర్ 5న విడుదల కానుంది.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల రేట్లు పెంచుకునేందుకు వీలుగా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీపీఐ నారాయణ స్పందించారు. ఇలా రేట్లు పెంచడం మూలంగానే ఐ బొమ్మ రవి వంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారని పేర్కొన్నారు. రూ.కోట్లాది ఖర్చు చేసి విలాసవంతమైన సినిమాలు తీసి ఆ డబ్బులను ప్రజల వద్ద వసూలు చేయడం ఎంతవరకు న్యాయం అని నిలదీశారు. ఇలా రేట్లు అధికంగా పెంచేసి సంపన్న వర్గాలకు ఊడిగం చేస్తూ వ్యవస్థతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు.
సినిమా టికెట్ల రేట్లు భారీగా పెంచి ప్రజలను ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని, థియేటర్లకు ప్రజలను, కళామ్మ తల్లికి ప్రజలను దూరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలా అధిక డబ్బులు పెట్టలేక ప్రజలు ఐ బొమ్మ రవి పైరసీ సినిమాలు చూస్తున్నారని, ప్రభుత్వాలే అలాంటి వ్యక్తుల్ని సృష్టిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ ధోరణి మారనంత వరకు ఐ బొమ్మ రవి లాంటి వ్యక్తులు పుడుతూనే ఉంటారని నారాయణ హాట్ కామెంట్స్ చేశారు.









