CM Chandrababu News | ఎక్కువ ప్రోటీన్ లభించే ఆహారాన్ని తీసుకోవాలని ఇందులో భాగంగా రోజుకు ఒక్క పూట చేప లేదా రొయ్య తినాలని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇవి తినడం మూలంగా ఎక్కువ ప్రోటీన్ లభిస్తుందని వివరించారు.
శాసనసభలో సోమవారం వ్యవసాయం, ఉద్యాన సాగుపై జరిగిన చర్చలో భాగంగా అనుబంధ శాఖలపై ముఖ్యమంత్రి ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రతీ ఎమ్మెల్యే వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నెలకోసారి అయిన పొలం బాట పట్టాలని స్పష్టం చేశారు.
రైతుల సమస్యలు విని పరిష్కారం దిశగా ఆలోచన చేయాలన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో ఏపీలోని ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ట్రంప్ టారిఫ్ ల ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. ట్రంప్ దెబ్బతో రొయ్య విలవిలాడుతోందని, రూ.25 వేల కోట్ల మార్కెట్ పై తీవ్ర ప్రభావం పడిందన్నారు.
ఈ క్రమంలో దేశం, రాష్ట్రంలో ఆక్వా వినియోగం పెంచేలా చర్యలు తీసుకోబోతున్నట్లు చెప్పారు. ఎక్కువ ప్రోటీన్ ఉండే చేప లేదా రొయ్యను రోజుకు ఒక్క పూటైనా తినాలని చెప్పారు. అలాగే వారంలో ఒకసారి కాలేజీలు, పాఠశాలల్లో చేప లేదా రొయ్యతో కూడిన ఆహారాన్ని అందించే యోచన చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.









