BJP and Congress team up to keep Sena out of local body | భారతీయ జనతా పార్టీ-కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం ఇప్పుడు జాతీయంగా సంచలనంగా మారింది. రాజకీయ ప్రత్యర్థి పార్టీలైన ఈ రెండు కలవడం ఇప్పుడు కలకలం రేపింది. కూటమిలో ఉన్న పార్టీని ఓడించేందుకు బీజేపీ కాంగ్రెస్ కలవడం గమనార్హం మహారాష్ట్రలోని అంబరనాథ్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు తాజగా జరిగాయి. ఇందులో శివసేన ఏకనాథ్ షిండే వర్గం అధిక సీట్లలో గెలిచింది. అయితే శివసేనకు అధికారాన్ని దక్కకుండా చేసేందుకు బీజేపీ కాంగ్రెస్ ఒక్కటయ్యాయి. మొత్తం 60 సీట్లు ఉండగా శివసేన 27, బీజేపీ 14, కాంగ్రెస్ 12, అజిత్ పవార్ కు చెందిన ఎన్సీపీ 4, మిగిలిన చోట్ల ఇతరులు గెలిచారు. షిండే శివసేనకు ఓడించేందుకు బీజేపీ-కాంగ్రెస్-ఎన్సీపీ ఒకటయ్యాయి. ఈ కూటమికి ‘అంబరనాథ్ వికాస్ అఘాడీ’ అని నామకరణం చేశారు.
దింతో బీజేపీ అభ్యర్థి తేజశ్రీ కరంజులే మేయర్ పీఠంపై కూర్చున్నారు. ఈ క్రమంలో షిండే శివసేన నేతలు భగ్గుమన్నారు. ఇదే వెన్నుపోటు అని పేర్కొన్నారు. కారణం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో శివసేన కూడా భాగమే. బీజేపీ-కాంగ్రెస్ పొత్తుతో షిండే శివసేన మేయర్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఇదే దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హస్తం నేత సచిన్ సావంత్ దీనిపై స్పందిస్తూ స్థానికంగా షిండే శివసేన అవినీతిపై పోరాడేందుకు అందరూ కలిసి వచ్చినట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికారికంగా బీజేపీ-కాంగ్రెస్ పొత్తు పెట్టుకోలేదన్నారు.









