Asia Cup 2025 final | దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మరోసారి పాకిస్థాన్ కు బుద్ధి చెప్పింది టీం ఇండియా. ఆసియా కప్-2025లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్స్ లో భారత్-పాకిస్థాన్ తలపడ్డాయి. ఇందులో ఐదు వికెట్ల తేడాతో దాయాధి దేశాన్ని మట్టికరిపించింది భారత్ తొమ్మిదవ సారి ఆసియా కప్ విజేతగా నిలిచింది.
అనంతరం ట్రోఫీని తీసుకోవడానికి ప్లేయర్లు నిరాకరించారు. పాకిస్థాన్ మంత్రి అయిన మోసిన్ నక్వీ ప్రస్తుతం ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో విజేతగా నిలిచిన భారత్ కు మోసిన్ నక్వీనే ట్రోఫీని అందించాల్సి ఉంది. అయితే నిత్యం భారత్ పై విషం చిమ్మే నక్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి ప్లేయర్లు నిరాకరించారు.
ట్రోఫీ ప్రెసెంటేషన్ కార్యక్రమంలో వేదికపై నక్వీ నిల్చుని ఉండగా, ట్రోఫీని నిరాకరించిన ప్లేయర్లు మైదానంలో సేద తీరుతూ ఫోన్లో బిజీగా ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇకపోతే భారత్ ట్రోఫీని నిరాకరించినట్లు ప్రెసెంటర్ ప్రకటించారు. ట్రోఫీ లేకుండానే ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. అలాగే విజేతగా నిలిచిన భారత్ కు రూ.21 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది.









