Akhanda 2 release postponed News | నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘అఖండ-2 తాండవం’ విడుదల అకస్మాత్తుగా వాయిదా పడింది. దింతో థియేటర్లను ముస్తాబు చేసి, వెండితెరపై బాలయ్యను చూసేందుకు సర్వం సిద్ధం చేసుకున్న అభిమానులు తీవ్ర అసహనానికి గురయ్యారు. డిసెంబర్ ఐదున ఈ సినిమా విడుదల అవ్వాల్సి ఉంది. గురువారం రాత్రి ప్రీమియర్ షోలు కూడా బుక్ అయ్యాయి. అయితే అనూహ్యంగా ప్రీమియర్ షోలు రద్దు అయ్యాయి.
ఆ తర్వాత సినిమా విడుదల తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14-రీల్స్ సోషల్ మీడియాలో తెలిపింది. అనివార్య కారణాల రీత్యా సినిమా విడుదల అవ్వడం లేదని మేకర్స్ ప్రకటించారు. కాగా అఖండ-2 చిత్రాన్ని నిర్మించిన 14-రీల్స్ మరియు బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ అయిన ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ మధ్య చాలా ఏళ్లుగా వివాదం కొనసాగుతుంది. ఈ వివాదానికి బాలయ్య సినిమాతో సంబంధం లేదు. కానీ 14 రీల్స్ తమకు రూ.28 కోట్లు బాకీ ఉందని, ఆ డబ్బులు చెల్లించేంత వరకు అఖండ-2 సినిమా విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలని బాలీవుడ్ నిర్మాణ సంస్థ మద్రాస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరువైపులా వాదనలు వింది. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు సినిమా విడుదల చేయొద్దంటూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే అఖండ-2 వాయిదా పడింది.









