A Dog Saves Man From Tiger| తన ప్రాణాలను పణంగా పెట్టి యజమాని ప్రాణాలు కాపాడింది ఓ పెంపుడు శునకం. శునకాలు మనిషి యొక్క అత్యంత విశ్వసనీయ జంతువు అని మరోసారి నిరూపితం అయ్యింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ జిల్లాలో చోటుచేసుకుంది. నైనీతాల్ జిల్లాలోని మదనపూర్ గైబువా గ్రామానికి చెందిన రక్షిత్ పాండే జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. తాజగా శునకంతో కలిసి తన చెరుకు తోటకు వెళ్లారు రక్షిత్ పాండే. అయితే అప్పటికే తోటలో నక్కిన పులి రక్షిత్ ను చూసిన వెంటనే పంజా విసిరింది. యజమానికి జరుగుతున్న ప్రమాదాన్ని గమనించిన శునకం వెంటనే పులిపై దాడికి దిగింది.
ఈ క్రమంలో పులి-శునకం మధ్య భీకర పోరు జరిగింది. ఇదే సమయంలో పులి దాడి నుంచి తప్పించుకున్న శునకం యజమాని గ్రామంలోకి పరుగు తీసి ఇతరులను వెంట తీసుకుని చెరుకు తోట వద్దకు వచ్చారు. అయితే పులితో వీరోచితంగా పోరాడిన పెంపుడు శునకం తీవ్ర గాయాలతో మృతి చెందింది. శునకాన్ని చూసిన యజమాని కన్నీటిపర్యంతం అయ్యారు. ఘటనా స్థలికి చేరుకున్న అటవీ అధికారులు శునకానికి పోస్ట్ మార్టెం నిర్వహించారు. పులి సంచరిస్తుండడంతో ఆ గ్రామంలో పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు.









