HMWS&SB files FIRs against 19 residents in S.R. Nagar for illegal water connections | జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశాలతో అక్రమ నల్లా కనెక్షన్ దారులపై విజిలెన్స్ అధికారులు కొరడా ఝళిపించారు. జలమండలి సరఫరా చేస్తున్న పైపులైను నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ పొందిన పందొమ్మిది మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఎస్ ఆర్ నగర్, తట్టిఖనా సెక్షన్ పరిధిలో ఇటీవల జిహెచ్ఎంసీ నూతన రోడ్డు నిర్మాణం చేపట్టింది. ఇదే అదునుగా భావించిన కాలనీకి చెందిన పందొమ్మిది మంది అధికారుల అనుమతులు లేకుండా వారే స్వంతంగా మొత్తం 19 అక్రమ నల్లా కనెక్షన్ తీసుకున్నారని అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో జలమండలి విజిలెన్స్ విభాగం ఎండీ సూచనలతో అక్రమ నల్లా కనెక్షన్‌ను తొలగించడంతో పాటు అక్రమ కనెక్షన్ తీసుకున్న 19 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అధికారుల అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. జలమండలి అధికారుల నుంచి అనుమతి లేకుండా ఎవరైనా అక్రమంగా తాగునీటి నల్లా, సీవరేజ్ పైపు లైన్ కనెక్షన్లు తీసుకుంటే.. క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.









