Hyderabad CP Sajjanar News | ‘మియా డ్రింక్ కియా, తో స్టీరింగ్ కో సలాం బొల్కే క్యాబ్ పక్డో’ అని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్. బుధవారం నుంచి న్యూ ఇయర్ రోజు వరకు నగరవ్యాప్తంగా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నట్లు ఆయన ఇప్పటికే తెలిపారు. ఇదే సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిని ఉద్దేశిస్తూ ముందస్తు సూచనలు చేశారు.
న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం సేవించినట్లైతే క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్లాలన్నారు. ఛలాన్, జైలు కంటే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లడం మంచిది అని సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. అలాగే ‘మా నాన్న ఎవరో తెలుసా, మా అన్న ఎవరో తెలుసా అని పోలీసులను అడగొద్దు. మేము మీ ప్రైవసీని గౌరవిస్తాం. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే వాహనం పక్కకు పెట్టి కోర్టులో కలుసుకుందాం’ అని సజ్జనర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పట్ల కఠినంగా వ్యవహరిస్తారని సజ్జనర్ తేల్చి చెప్పారు.









