Nagababu Fires On Shivaji Comments | నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రాధారణ పై చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఆయనపై పలువురు నటులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజగా ఎమ్మెల్సీ నాగబాబు శివాజీ వ్యాఖ్యలపై స్పందించారు. స్త్రీ వస్త్రాధారణ ఇలానే ఉండాలి అని కొందరు మగ అహంకారంతో మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. తన లక్ష్యం శివాజీ కాదని అలా అనుకుంటే వారి ఇష్టమన్నారు. కానీ ఇలాంటి రుగ్మత సమాజంలో పెట్రేగిపోతుందని అసహనం వ్యక్తం చేశారు.
స్త్రీ ఎలా ఉండాలి, ఎలాంటి వస్త్రాలు ధరించాలి అని పండితుడి నుండి పామరుడు వరకు మాట్లాడుతున్నారని దీనినే మోరల్ పోలీసింగ్ అంటారని వివరించారు. కానీ ఇది రాజ్యాంగానికి విరుద్ధం అని స్పష్టం చేశారు. భారతదేశంలో మోరల్ పోలీసింగ్ రాజ్యాంగ విరుద్ధమన్నారు. స్వేచ్ఛ, గౌరవం, గోప్యత, సమానత్వం వంటి మౌలిక హక్కులను భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19, 21 కింద హరించేస్తుందని కోర్టులు పునరావృతంగా తీర్పులు ఇచ్చాయని పేర్కొన్నారు.
ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. స్త్రీ వస్త్రధారణ గురించి ప్రశ్నించే హక్కు ఇతరులకు ఎక్కడుందని నిలదీశారు. మగవాడు కాబట్టి ఎవరి గురించి ఏదైనా మాట్లాడుతారా అని ఆగ్రహించారు. ఇలా వ్యాఖ్యలు చేస్తున్న వారికి కొందరు మహిళలు కూడా మద్దతివ్వడం దురదృష్టకరం అని అన్నారు. ఆడపిల్లల పైన అత్యాచారాలు కేవలం వారు వేసుకొనే దుస్తుల వల్ల కావడం లేదని మగాళ్ళ క్రూరత్వం వల్లనే జరుగుతున్నాయని చెప్పారు.









