Wife Kills Husband | వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడి సాయంతో భర్తను భార్యే హత్య చేసిన ఘటన మేడ్చెల్ మల్కాజ్ గిరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బెంగళూరుకు చెందిన అశోక్ (45), పూర్ణిమ (36)లకు 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.
ప్రస్తుతం అశోక్ ఘట్ కేసర్ లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్నాడు. పూర్ణిమ ప్లే స్కూల్ నిర్వహిస్తోంది. గతంలో వీరు బోడుప్పల్ లో నివసిస్తున్న సమయంలో పూర్ణిమకు అదే ప్రాంతంలో నివసించే భవన నిర్మాణ కూలీ మహేశ్ (22)తో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది.
విషయం తెలిసిన భర్త అశోక్ భార్యను చాలాసార్లు మందలించాడు. చివరికి అక్కడి నుంచి తమ మకాం ఘట్ కేసర్ కు మార్చాడు. అయినప్పటికీ వారి సంబంధం అలాగే కొనసాగుతోంది. భర్తను అడ్డు తొలగిస్తే తమ ప్రేమకు ఎలాంటి ఆటంకాలు ఉండవని భావించిన పూర్ణిమ, తన ప్రియుడు మహేష్, అతని స్నేహితుడు సాయితో కలిసి ఒక పథకం పన్నింది.
డిసెంబర్ 11న అశోక్ తన విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, మహేష్, అతని స్నేహితుడు సాయి, పూర్ణిమతో కలిసి అశోక్ మెడకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆ తర్వాత, పూర్ణిమ తన భర్త గుండెపోటుతో మరణించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పూర్ణిమపై అనుమానం వచ్చిన అశోక్ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోస్ట్ మార్టం నివేదికలో అశోక్‌ను గొంతు నులిమి చంపినట్లు తేలింది. దీంతో పోలీసులు నిందితులను విచారించారు. ఈ విచారణలో పూర్ణిమ మరియు ఆమె ప్రియుడు తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు పూర్ణిమ, మహేష్, సాయిలను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు.









