Hardik Pandya hit a cameraman with a six | హార్దిక్ పాండ్య పవర్ఫుల్ సిక్సర్ కొట్టిన సమయంలో బంతి నేరుగా వెళ్లి కెమెరామెన్ కు తగిలింది. దింతో కాసేపు హార్దిక్ పాండ్య మరియు ఇతర ఆటగాళ్లు ఆందోళనకు గురయ్యారు. అయితే కెమెరామెన్ స్వల్ప గాయంతో బయటపడ్డారు. అనంతరం హార్దిక్ నేరుగా వెళ్లి సదరు వ్యక్తిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని క్షమాపణలు కోరారు. అదృష్టవశాత్తూ బంతి భుజంపై తగిలింది, కానీ తల భాగంలో తగిలుంటే మాత్రం పెను విషాదం చోటుచేసుకునేది అని హార్దిక్ పేర్కొన్నారు. ఐదు మ్యాచుల టీ-20 సిరీస్ లో భాగంగా సౌత్ ఆఫ్రికాతో శుక్రవారం టీం ఇండియా చివరి మ్యాచ్ ఆడింది.
అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచులో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్య విధ్వంసకర ఇన్నింగ్స్ తో చెలరేగిపోయారు. కేవలం 25 బంతుల్లోనే ఐదు సిక్సులు, ఐదు ఫోర్లతో 63 పరుగులు చేశారు. ఇదే సమయంలో హార్దిక్ పవర్ఫుల్ సిక్సర్ కొట్టగా బంతి మైదానంలో చిత్రీకరిస్తున్న కెమెరామెన్ కు బలంగా తగిలింది. ఆ వెంటనే సిబ్బంది అతడి వద్దకు వెళ్లి ప్రథమ చికిత్స చేశారు. ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం హార్దిక్ స్వయంగా అతడి వద్దకు వెళ్లి పరామర్శించారు. క్షమాపణ కోరి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం గాయంపై కొద్దిసేపు ఐస్ ప్యాక్ ను పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.








