Rohit Sharma and Virat Kohli in Vijay Hazare Trophy 2025 | టీం ఇండియా మాజీ కెప్టెన్లు, దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు విజయ్ హజారే ట్రోఫీలో భాగం కానున్నారు. ముంబయి జట్టు తరఫున రోహిత్ తొలి రెండు మ్యాచులు, ఢిల్లీ తరఫున విరాట్ రెండు లేదా మూడు మ్యాచులు ఆడే అవకాశం ఉంది. ఈ మేరకు ముంబయి క్రికెట్ అసోసియేషన్, ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ రోహిత్, విరాట్ ట్రోఫీలో ఆడబోతున్నట్లు స్పష్టం చేశాయి. డిసెంబర్ 24 నుంచి వచ్చే ఏడాది జనవరి 18 వరకు ఈ ట్రోఫీ కొనసాగనుంది. కాగా అంతర్జాతీయ ఆటగాళ్లు కనీసం రెండు డొమెస్టిక్ మ్యాచులు అయినా ఆడాలని బీసీసీఐ సూచించింది.
ఈ క్రమంలో సుమారు 15 ఏళ్ల తర్వాత విరాట్ విజయ్ హజారే ట్రోఫీలో భాగం కానున్నారు. చివరి సారిగా ఈ ఆటగాడు 2010లో ఈ ట్రోఫీలో పాల్గొన్నారు. ఇకపోతే 2018 సీజన్ లో కనిపించిన రోహిత్ మళ్లీ ఇప్పుడు విజయ్ హజారేలో సందడి చేయనున్నారు. డిసెంబర్ 24 నుంచి జనవరి ఎనమిది వరకు గ్రూప్ స్టేజి మ్యాచులు, ఆ తర్వాత నాకౌట్ మ్యాచులు జరగనున్నాయి. జైపూర్ వేదికగా డిసెంబర్ 24, 26న సిక్కిం, ఉత్తరాఖండ్ తో జరగబోయే మ్యాచులో రోహిత్ అడనున్నారు. ముంబయి జట్టుకు శార్దూల్ ఠాకూర్ కెప్టెన్. ఇకపోతే విరాట్ కూడా తొలి రెండు లేదా మూడు మ్యాచులు ఆడనున్నారు. ఢిల్లీ జట్టుకు రిషబ్ పంత్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. ఇషాంత్ శర్మ, నవదీప్ సైనీ కూడా ఢిల్లీ జట్టులో ఉన్నారు.









