Telangana Panchayati Elections | తెలంగాణ పంచాయతీ ఎన్నికలు బుధవారంతో ముగిశాయి. పలుచోట్ల చెదురుముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయి. మొత్తం మూడు విడతల్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని ప్రతిపక్ష బీఆరెస్ పై పైచేయి సాధించింది. వివిధ కారణాలతో కొన్ని పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు. ఇకపోతే ఏకగ్రీవంతో కలిపి ఎన్నికలు జరిగిన 12, 733 పంచాయతీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 7010 స్థానాల్లో విజయం సాధించారు. మరోవైపు అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చిన కేసీఆర్ పార్టీ మంచి ఫలితాలను సొంతం చేసుకుంది. బీఆరెస్ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు 3502 స్థానాల్లో గెలుపొందారు.
ఇకపోతే బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 688 స్థానాలు పొందారు. ఇతరులు 1505 స్థానాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీ మద్దతున్న అభ్యర్థులను ఓడించి సర్పంచులుగా గెలుపొందారు. ఇందులో సీపీఐ, సీపీఎం మద్దతున్న అభ్యర్థులు ఉన్నారు. ఇకపోతే సిద్దిపేట జిల్లా మినహా మిగిలిన 30 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లను సొంతం చేసుకుంది. మూడు విడతలు కలిపి మొత్తం 85.30 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓటింగ్ జరిగింది. ఇకపోతే నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లు డిసెంబర్ 22న ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపడుతారు.









