Mahindra Thar Driven By 65-Year-Old Enters Railway Track | రైలు పట్టాలపై కారు పరుగులు పెట్టడం కలకలం రేపింది. పట్టాలపై రైలు బదులు థార్ కారు వెళ్తుండడం చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు కారును పట్టాలపై నుండి తొలగించారు. సకాలంలో స్పందించడంతో ఎలాంటి పెను ప్రమాదం జరగలేదు. దింతో పోలీసులు, రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకుంది. ఈ ఘటన నాగాలాండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
ఓ 65 ఏళ్ల వ్యక్తి దిమాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపైకి తన మహీంద్రా కారును ఎక్కించారు. అనంతరం కొద్దీ దూరం పట్టాలపైనే డ్రైవింగ్ చేశారు. అయితే కొద్దీ దూరం వెళ్లిన తర్వాత కారు ఆగిపోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు, రైల్వే సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆ వెంటనే కారును పట్టాలపై నుండి తొలగించారు. పట్టాలకు, రైల్వే ఆస్తులకు ఎలాంటి నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. మరోవైపు కారును నడిపిన 65 ఏళ్ల డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.









