Telangana Panchayati Elections | కోడలిని గెలిపించాలని అమెరికా నుంచి వచ్చి మరీ ఓటు వేసాడు మామ. ఇప్పుడు ఆయన వేసిన ఓటు కోడలి విజయానికి కారణం అయ్యింది. ఆమె కేవలం ఒక్క ఓటు తేడాతో సర్పంచ్ అభ్యర్థిగా విజయం సాధించారు.
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం రెండో విడత ఎన్నికలు జరిగాయి. తొలి విడతతో పోల్చితే ఈ సారి అధికంగా ఓటింగ్ జరిగింది. కాగా పలు గ్రామ పంచాయతీల్లో కేవలం ఒక్క ఓటు తేడాతో అభ్యర్థులు సర్పంచ్ పదవికి కైవసం చేసుకున్నారు. ఇలాంటి ఘటనే నిర్మల్ జిల్లాలో కూడా జరిగింది.
లోకేశ్వరం మండలంలోని బాగాపూర్ పంచాయతీలో ముత్యాల శ్రీవేద అనే అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. అయితే శ్రీవేద మామ కోడలి విజయంలో కీలక పాత్ర పోషించారు. ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి రెండు నెలల కిందట అమెరికాలోని కుమార్తె వద్దకు వెళ్లారు. ఇదే సమయంలో పంచాయతీ ఎన్నికల్లో కోడలు పోటీకి దిగింది. అయితే గ్రామంలో శ్రీవేదకు మరియు ఆమె ప్రత్యర్థి హర్షస్వాతికి మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ క్రమంలో గ్రామంలో గట్టిపోటీ నెలకొని ఉందని తెలుసుకున్న మామ ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నిక కంటే కేవలం నాలుగు రోజుల ముందు స్వగ్రామానికి చేరుకున్నారు. కోడలి తరఫున ప్రచారం చేశారు.
ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించారు. అనంతరం వెలువడిన ఫలితాల్లో మొత్తం 426 ఓట్లకు 378 పోలయ్యాయి. ఇందులో శ్రీవేదకు 189, ఆమె ప్రత్యర్థి హర్షస్వాతికి 188 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు చెల్లలేదు. శ్రీవేద ఒక్క ఓటుతో విజయం సాధించారు. అమెరికా నుండి వచ్చిన మామ వేసిన ఆ ఒక్క ఓటుతోనే కోడలు గెలిచిందని కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి తండ్రి ముత్యాల సత్యనారాయణ రెడ్డి 1972లో సర్పంచ్ గా గెలిచారు. 2013లో చిన్నమ్మ ముత్యాల రజిత గెలిచారు. ఇప్పుడు శ్రీవేద రూపంలో ఆ కుటుంబం నుండి మూడవ తరం సర్పంచ్ గా విజయం సాధించారు.









