Bondi Beach shooting | ఆస్ట్రేలియాలో కాల్పుల కలకలం రేగింది. ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు 12 మంది మృతి చెందినట్లు కథనాలు వస్తున్నాయి. సిడ్నీ నగరంలోని బాండీ బీచ్ ప్రముఖ పర్యటక ప్రాంతం. ఆదివారం ఇక్కడ స్థానిక యూదులు హనుక్కా వేడుకను జరుపుకుంటున్నారు. కాల్పుల సమయంలో వందలాది మంది యూదులు ఇక్కడ జరుగుతున్న వేడుకలో సరదాగా గడుపుతున్నారు. ఇదే సమయంలో ఇద్దరు దుండగులు నల్లటి ముసుగులు ధరించి ఓ వంతెనపైకి చేరుకున్నారు.
అనంతరం తమ వద్ద ఉన్న షాట్ గన్ తో ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 12 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. అలాగే తీవ్రంగా గాయపడిన ఓ దుండగుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఈ దుండగులు ఎవరు, కాల్పులు ఎందుకు జరిపారు, యూదులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోని ఆల్బనీస్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ఓ ఉగ్రవాద దాడి అని ప్రకటించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.









