Pawan Kalyan Sanctions Rs. 6.2 Crore Road for Captain Deepika’s Village | ప్రపంచ కప్ గెలిచిన అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన దీపిక తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేదని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకు వచ్చారు. తమ ఊరు తంబలహెట్టి రోడ్డు వేయించమని కోరారు.
శుక్రవారం మధ్యాహ్నం మంగళగిరిలో అంధ మహిళల క్రికెట్ జట్టుతో ఉప ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దీపిక తమ ఊరికి రోడ్డు గురించి అడిగారు. ఆమె మధ్యాహ్నం అడిగిన రోడ్డుకి సాయంత్రానికి అనుమతులు వచ్చేలా పవన్ చర్యలు చేపట్టినట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక విజ్ఞప్తి మేరకు రోడ్లను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
అందుకు అనుగుణంగా శ్రీ సత్యసాయి జిల్లా అధికారులు మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలంలోని హేమవతి పంచాయతీ పరిధిలో ఉన్న తంబలహెట్టి రోడ్లను పరిశీలించారు. హేమావతి నుంచి తంబలహెట్టి వరకూ రోడ్డు నిర్మాణానికి రూ.3.2 కోట్లు, గున్నేహళ్లి నుంచి తంబలహెట్టీ వరకూ 5 కిమీ రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు అవసరమని అంచనా రూపొందించారు. వీటికి అనుమతులు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పాలనాపరమైన అనుమతులు జారీ చేశారు.









