Lionel Messi GOAT Tour of India | అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనల్ మెస్సి భారత పర్యటన మొదలైంది. క్రికెట్ ను మతంలా భావించే భారత నగరాల వీధుల్లో ఇప్పుడు ‘మెస్సి’ నినాదాలు వినిపిస్తున్నాయి. శనివారం తెల్లవారుజామున మెస్సి కోల్కత్త విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. ఈ క్రమంలో అభిమానులు విమానాశ్రయం వద్దకు భారీగా చేరుకున్నారు. హోటల్ కు మెస్సి వెళ్లిన మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న అభిమానులు మెస్సికి నీరాజనాలు పలికారు.
అనంతరం శనివారం ఉదయం లేక్ టౌన్ లో ఏర్పాటు చేసిన 70 అడుగుల తన విగ్రహాన్ని మెస్సి స్వయంగా ఆవిష్కరించారు. విర్చువల్ గా ఈ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. అనంతరం కోల్కత్తలో ప్రఖ్యాత సాక్ట్ లేక్ స్టేడియంకు మెస్సి వెళ్లారు. మెస్సిని చూసేందుకు వేలాది మంది అభిమానులు స్టేడియంకు చేరుకున్నారు.
అయితే పట్టుమని 10 నిమిషాలు కూడా మెస్సి స్టేడియంలో లేరని, ఆయన ఉన్న సమయంలో కూడా అధికారులు, నేతలు, ఇతర ప్రముఖులు మెస్సిని చుట్టేయ్యడంతో సంతృప్తిగా వీక్షించలేకపోయినట్లు అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.








