Telangana Panchayati Elections | తెలంగాణ పల్లెల్లో పంచాయతీ పోరులో తొలిదశ ముగిసింది. ఇందులో హస్తం బలపరిచిన అభ్యర్థులు హవా కనబరిచారు. మరోవైపు బీఆరెస్ మద్దతిచ్చిన అభ్యర్థులు కూడా మంచి ఫలితాలను రాబట్టారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం తొలిదశ ఎన్నిక జరిగింది. తొలిదశలో భాగంగా 4,236 సర్పంచ్ పదవులకు, 37, 440 వార్డు సభ్యుల స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో 396 సర్పంచ్, 9,663 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
గురువారం 3,834 సర్పంచ్ స్థానాలకు, 27, 628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మరికొన్ని చోట్ల వివిధ కారణాలతో ఎన్నిక జరగలేదు. ఇకపోతే ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2,383 సర్పంచి స్థానాల్లో గెలుపొందారు. బీఆరెస్ మద్దతుదారులు 1,146 స్థానాలను కైవసం చేసుకున్నారు. బీజేపీ 200లోపు స్థానాలను కైవసం చేసుకుంది. ఇకపోతే 455 చోట్ల స్వతంత్ర అభ్యర్ధులు బలమైన పార్టీల మద్దతుదారులను ఓడించారు. ఇందులో సీపీఎం మద్దతుదారులు 14, సీపీఐ బలపరిచిన అభ్యర్థులు 16 చోట్ల గెలుపొందారు. సిద్దిపేట మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఆధిక్యం కనబరిచారు.









