Sonu Sood Wants Social Media Banned for Kids in India After Australia’s Landmark Rule | కేంద్ర ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేశారు ప్రముఖ నటుడు సోనూ సుద్. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ ఇటీవలే ఆస్ట్రేలియాలో కొత్త చట్టం వచ్చిన విషయం తెల్సిందే. ఇలాంటి చట్టం భారత్ లో కూడా రావాల్సిన అవసరం ఉందన్నారు సోనూ సుద్. కాగా ఆస్ట్రేలియా తీసుకువచ్చిన నూతన చట్టం ఆధారంగా 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ యాపులైన ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్ బుక్, టిక్ టాక్, థ్రెడ్స్, స్నాప్ చాట్ వంటివి వినియోగించలేరు.
చిన్నారుల ఖాతాలను తొలగించడం, కొత్తవి క్రియేట్ చేసుకోకుండా చూడడం టెక్ కంపెనీల బాధ్యత అని ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ మీడియా హాని నుంచి పిల్లలను రక్షించుకునే ఉద్దేశ్యంతో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సోను సూద్ స్పందించారు. ఆస్ట్రేలియా తీసుకువచ్చిన చట్టాన్ని భారత్ కూడా పరిశీలించాలని పేర్కొన్నారు. పిల్లలు బాల్యాన్ని ఆస్వాదించేలా, బలమైన కుటుంబ బంధాలు తెలుసుకునేలా అలాగే స్క్రీన్ అడిక్షన్ నుంచి విముక్తి కలిగేలా చూడాలని ఈ నటుడు ప్రభుత్వాన్ని కోరారు. నేడు మనం పిల్లల్ని కాపాడుకుంటే దేశ భవిష్యత్ మెరుగ్గా ఉంటుందని సోను సూద్ పేర్కొన్నారు.









